కలం, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి (Vatavarlapalli) గ్రామంలో స్వచ్ఛంద పునరావాస కోరుకుంటున్న కుటుంబాలు ఆదివారం ఉదయం ఫారెస్ట్ అధికారులతో ఎంవోయూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పునరావాసం కోరుకుంటున్న కుటుంబాలు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం ఫారెస్ట్ అధికారులు అన్ని వసతులు కల్పించి త్వరగా గృహ నిర్మాణాలు చేపట్టాలని అందుకు సంబంధించిన వ్యవసాయం చేసుకునేందుకు ఐదు ఎకరాల భూమి రెవెన్యూ పట్టాలు అందించాలని కోరుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా ఎంఓయూ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే గ్రామంలో ఉన్న మరికొంత మంది వ్యక్తులు పునరావాసానికి వెళ్లకుండా గ్రామంలోనే ఉంటామని మొండికేస్తున్నారని అధికారులు తెలిపారు. అంతే కాకుండా గ్రామ అభివృద్ధి జరగడంలేదని, ఫారెస్ట్ అధికారులే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

