కలం, వనపర్తి: పట్టణంలోని మర్రికుంటలో రైతు శాంతన్న సాగు చేసిన బంతిపూల తోటను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా బంతిపూల సాగు విధానాన్ని, ఏపుగా పెరిగిన పంటను పరిశీలించి రైతు శాంతన్నను అభినందించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కాలానుగుణంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దసరా, దీపావళి పండుగల సమయంలో బంతిపూలకు అధిక డిమాండ్ ఉంటుందని తెలిపారు. పూల కోసం దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే స్థానిక రైతులు సాగు చేసిన పూలు అందుబాటులో ఉండటం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
స్థానికంగా పూల సాగును ప్రోత్సహించడం వల్ల రైతులకు ఆదాయం లభించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన పూలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రైతు శాంతన్న సాగు చేసిన బంతిపూల తోటను ప్రోత్సహించే ఉద్దేశంతో దసరా, దీపావళి పండుగల కోసం పూలకు స్వయంగా ఆర్డర్ ఇచ్చినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్థానిక రైతుల కృషికి ప్రోత్సాహం అందించడం అవసరమని పేర్కొన్నారు. నిరంజన్‌రెడ్డి వెంట వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మాధవరెడ్డి, సునీల్ వాల్మీకి, మంద రాము, ఎండీ అలీం, ముద్ద సిర్, జమీల్, చీర్ల శ్రీనివాసులు, బెదారి కుమార్, శంకర్ నాయక్, కృష్ణ నాయక్ తదితరులు ఉన్నారు.

