పాల్వంచలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ (Palvancha) మండలం కేటీపీస్ పవర్ ప్లాంట్ పరిధిలోని కరకవాగు ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిన్నెరసాని నుంచి వచ్చే కేటీపీస్ కాలువలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ​చుంచుపల్లి మండలం రామవరం ప్రాంతానికి చెందిన తుడుం భరత్ (23), ఎస్కే సమీర్ (24) శనివారం కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకు దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. యువకులు కాలువ వద్దకు వెళ్లిన సమయంలో మద్యం సేవించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ జరగాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ప్రమాదానికి గల పూర్తి కారణాలను నిర్ధారించాల్సి ఉంది.

​పాల్వంచ కేటీపీస్ పవర్ ప్లాంట్ పరిధిలోని కాలువల్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు ఇరువైపులా సరైన ఫెన్సింగ్ లేదా సేఫ్టీ వాల్ లేకపోవడం, లోతు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కొరవడటం, నీరు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. ప్రమాదకరమైన ఈ కాలువ పక్కనే జనావాసాలు, పొలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వీడటం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

​ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాల్వంచ కేటీపీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని, కేటీపీస్ కాలువ వెంబడి పూర్తి స్థాయిలో ఇనుప కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్యానికి ఇప్పటికైనా తెరపడుతుందా? లేక మరిన్ని కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోవాల్సిందేనా? అని జిల్లా ప్రజలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>