కలం, నిర్మల్ : జాతీయ ఆరోగ్య మిషన్ (Nirmal NHM Strike) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

