కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9న జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్–టీఎంయూ–ఎన్ఎంయూ కూటమి.. 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం కార్మికుల ఐక్యతకు నిదర్శనమని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం కూటమి విజయాన్ని అధికారులు ధ్రువీకరించడంతో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో(Yadagirigutta Depot) నాయకులు, కార్మికులు విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ, ఏఐటీయూసీ నాయకులను ఘనంగా సన్మానించారు.
దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం సిపిఐ, ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం భవిష్యత్తులోనూ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోలగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇమ్రాన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పెరబోయిన మహేందర్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంగ, కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, ఈయూ రీజనల్ కార్యదర్శి జగదీష్, డిపో కార్యదర్శి సోకం వెంకన్న, అధ్యక్షుడు సోమేశ్, టీఎంయూ డిపో అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

