కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని 27వ డివిజన్ పరిధిలో రోడ్డు కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్థానికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. సీతారాంనగర్ కాలనీలో గుజరాత్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యను పరిష్కరించే దిశగా 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి (Corporator Kalpe Archana Chiranjeevi) ముందడుగు వేశారు. కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు (Road Construction works) ఆమె భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కల్పే అర్చన చిరంజీవి మాట్లాడుతూ ..ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యనే తన సమస్యగా భావిస్తానని, వాటికి పరిష్కారం లభించే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణంతో కాలనీవాసులకు రాకపోకలు సులభతరం కానున్నాయి.

