కలం, వెబ్డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు కేటాయించారు. ఇందులో సాలూరు, తిరువూరు మున్సిపల్ స్థానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు స్థానాలను జనసేనకు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా స్థానాల్లో జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాధవిని ప్రకటించగా, సాలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గొర్లి విజయ్ కుమార్ బరిలో ఉంటారని వెల్లడించింది. ఈ కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
తాను తిరువూరు అభ్యర్థిగా నాగ శ్రావణికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆమె నామినేషన్ కూడా వేస్తారని చెప్పారు. కూటమి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కొలికపూడి సొంత అభ్యర్థులను బరిలోకి దింపడం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. దీనిపై టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒక వేళ వస్తే అధిష్టానం ఎలా స్పందిస్తుంది? కొలికపూడి సొంత అభ్యర్థుల విషయంలో వెనకడుగు వేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొలికపూడి వ్యవహారంపై జనసేన నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. కూటమి నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న కొలికపూడి చర్యలు ఏ ములుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

