కలం, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి (Gnana Saraswati) దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అలంకారంలో (Kalaratri Alankaram) భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుర్గాదేవి ఏడో రూపమైన కాళరాత్రి అమ్మవారు అజ్ఞానం, చీకటిని తొలగించి భక్తులకు జ్ఞానాన్ని, అభయాన్ని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ‘కాళ’ అంటే మృత్యువు, ‘రాత్రి’ అంటే చీకటి అని అర్థం.
అజ్ఞానాంధకారాన్ని తొలగించే శక్తి స్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటారు. కాళరాత్రి అమ్మవారి రూపం (Kalaratri Alankaram) భయంకరంగా కనిపించినప్పటికీ, భక్తులకు అభయాన్ని ప్రసాదించే కరుణామయి. నల్లని శరీర ఛాయ, జడలుగా ఉన్న కేశాలు, చతుర్భుజాలు, గాడిద వాహనంతో దర్శనమిచ్చే అమ్మవారు ఒక చేతితో వరద ముద్రను, మరో చేతితో అభయ ముద్రను కలిగి ఉంటారు. మిగిలిన రెండు చేతుల్లో ఆయుధాలను ధరించి దుష్టశక్తుల సంహారిణిగా పూజలందుకుంటారు. కాళరాత్రి అమ్మవారిని ఆరాధించడం ద్వారా భయాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Also Read : విజయవాడ హైవేపై దసరా రద్దీ: భారీగా నిలిచిన వాహనాలు
Follow Us On: X(Twitter)

