కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ (Govind Mohan) హాజరై.. ప్రొబేషనర్లను ఉద్దేశించి మాట్లాడారు. “గత 50 ఏళ్లుగా మావోయిస్టులు, ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటుదారులతో పోరాడుతూ వస్తున్నాం. ఇప్పుడు నక్సలిజాన్ని దాదాపుగా అంతమొందించాం. ఈశాన్య ప్రాంతాల్లో కూడా తిరుగుబాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ జరుగుతోంది తిరుగుబాటు అనడం కంటే.. వివిధ జాతుల మధ్య ఘర్షణ అని చెప్పొచ్చు. వీటితో పాటు విదేశీ ఉగ్రవాదాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నాం” అని పేర్కొన్నారు.
ఆ అయిదు అతి పెద్ద సమస్యలు..
దేశాన్ని ప్రస్తుతం అయిదు సమస్యలు పట్టి పీడిస్తున్నాయని గోవింద్ మోహన్ అన్నారు. మొదటిది నార్కోటిక్స్ తీసుకోవడం సాధారణంగా విషయంగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో చేసిన సర్వే ప్రకారం, దేశంలో కనీసం 7 శాతం వీటికి బానిసలైనట్లు వివరించారు. రెండోది సైబర్ నేరాలు అని.. ప్రజలకు వీటిపై అవగాహన తక్కువ ఉండటంతో చాలా సులువుగా మోసానికి గురవుతున్నారని తెలిపారు. మూడోది, ఉగ్రవాదం ఇంకా అంతం కాలేదని ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్ర కోట పేలుళ్లు చాటి చెప్పాయన్నారు.
సమాజంలో కొంత మంది విదేశీయుల ప్రభావంతో ఉగ్రవాదులుగా మారుతున్నారని స్పష్టం చేశారు. నాలుగోది, విదేశీ అక్రమ వలసదారులతో అంతర్గత భద్రతకు సవాళ్లు ఏర్పడుతున్నాయని చెప్పారు. అయిదు, టెక్నాలజీ కారణంగా ప్రజల జీవితాల్లో ఎంత వేగంగా మార్పులు వస్తున్నాయో.. అంతే వేగంగా నేరగాళ్లు పుట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో విధుల్లో చేరే కొత్త అధికారులు వీటిపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

