కలం, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని (Parliament Special Session) ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన బిల్లులను మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సేషన్స్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో డీలిమిటేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందలేదు. ఈ క్రమంలో అవసరమైన మద్దతును కూడగట్టడంపై అధికార పక్షం దృష్టి సారించినట్లు సమాచారం.
విపక్షాల మద్దతు కోసం చర్చలు..
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల (Womens Reservation Bill) అమలుకు సంబంధించిన ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే మద్దతు పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, డీలిమిటేషన్ ప్రతిపాదనలను డీఎంకే గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, చిన్న పార్టీలతోనూ చర్చలు జరుపుతూ పార్లమెంట్లో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి హామీలు ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఈ చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ ఉండాలి. సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతుతో పాటు, సభ మొత్తం సభ్యత్వంలో సగానికి పైగా సభ్యుల మద్దతు కూడా అవసంర. సాధారణ మెజారిటీతోనే బిల్లును ఆమోదించడం అసాధ్యం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతును సాధించడం కీలకం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ నేపథ్యంలో..
అక్టోబర్ 26, 27 తేదీల్లో పార్లమెంట్ ప్రాంగణంలోని సంవిధాన్ సదన్లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణకు సుమారు వారం రోజుల ముందుగా నోటీసు ఇవ్వవచ్చని సమాచారం. గతంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, విద్యార్థుల నిరసనలు తదితర అంశాలపై విపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాల మధ్య మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం తదుపరి చర్యలపై ఆసక్తిగా మారింది.

