కలం, జగిత్యాల: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఇద్దరు రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎస్సై శ్రీకాంత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఎస్సైని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గవర్నర్, మానవహక్కుల కమిషన్ చైర్మన్ కు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నం కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్నం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు రిపోర్టర్లు శేఖర్, సంపత్ లను ఎస్ఐ శ్రీకాంత్ అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసినందుకే కక్షపూరితంగా ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి మాత్రమే కాక మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(a)) కు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.
అయితే ఎస్సై శ్రీకాంత్ ను జిల్లా ఎస్పీ కార్యలయానికి అటాచ్ చేసి చేతులు దులుపుకోవద్దని, ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన ఎస్ఐ పై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పిర్యాదులో కోరారు. బాధిత విలేకరులకు న్యాయం, రక్షణ కల్పించాలని కిషన్ రెడ్డి గవర్నర్, మానవహక్కుల కమిషన్ చైర్మన్ లను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు దిశగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఫిర్యాదులో కోరినట్లు ఆయన తెలిపారు.

