కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (MLA Madhusudhan Reddy) అధికారులను ఆదేశించారు. నవంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు0 నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తుల భద్రతకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఘాట్ రోడ్డు పనులు కొనసాగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. జాతర ప్రాంతంలో దొంగతనాలు జరగకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

రోడ్లపై ప్యాచ్‌వర్కులు, మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. అవసరమైన నిధుల విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జాతర రోజుల్లో, ముఖ్యంగా నవంబర్ 16 న ఉద్దాల ఉత్సవం సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని, వాహనాల పార్కింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించాలని, తగిన సంఖ్యలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులు, మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, కల్యాణ మండపం తదితర వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా, వాహనాల పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.జాతర ప్రాంగణంలో వివిధ శాఖల సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమైన సమాచారం అందేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిరంతర తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, షవర్ల ఏర్పాటు చేపట్టాలని, అవసరమైతే ముఖ్యమైన రోజుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు.

పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలని, పోలీసు శాఖ బందోబస్తు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ శాఖ బారికేడింగ్, రహదారుల మరమ్మతులు చేపట్టాలని, ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులు, మద్యం విక్రయాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. నిర్మల, శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ చైర్మన్ బత్తుల బాలరాజు, ఆర్డీవో నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, దేవాలయ ఈవో మదన్ రెడ్డి, జిల్లా అధికారులు, చిన్నచింతకుంట మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>