కలం, కరీంనగర్: రాష్ట్రంలో యాసంగి పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు చెప్పడం సిగ్గుచేటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar) మండిపడ్డారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ రైతులను ఆందోళనకు గురిచేయడం మాని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికను తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులపై అదనపు భారం..
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రవిశంకర్ ఆరోపించారు. విద్యుత్ కోతల వల్ల పంట పొలాలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పొలాలను కాపాడుకునేందుకు జనరేటర్లు వాడాల్సి రావడంతో రోజుకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరువును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పంటలు వేయొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
’కాళేశ్వరం’ను సమర్థంగా వినియోగించాలి
తెలంగాణలో ప్రాణహిత, గోదావరి వంటి జీవనదులు ఉన్నప్పటికీ సాగునీటి కొరత ఎందుకు వస్తోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ సర్కార్ ను రవిశంకర్ ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎల్నినో ముప్పు ఉందని తెలిసి కూడా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిని ఎందుకు నిల్వ చేయలేదని నిలదీశారు.
హామీలను నిలబెట్టుకోవాలి
బీఆర్ఎస్ హయాంలో నిరంతర విద్యుత్తో పాటు కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేశామని మాజీ ఎమ్మెల్యే గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం 24 గంటల ఉచిత కరెంట్, మూడు పంటలకు రైతుభరోసా, ఎకరానికి రూ.15 వేల సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగేలా బొగ్గు సరఫరాపై స్పష్టత ఇవ్వాలన్నారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన విశ్వవిద్యాలయం BRSV ఇన్చార్జ్ చుక్కా శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

