కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో మంత్రి సమావేశమయ్యారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో(Govt Schools) నూతన భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10.12 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే, కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి త్వరితగతిన రెగ్యులర్ ఉపకులపతిని నియమించడంతో పాటు, అక్కడ నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల పరిధిలో ఎంపిక చేసిన 16 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,988 మంది విద్యార్థులకు ఈ నిధుల ద్వారా మెరుగైన వసతులు, డిజిటల్ బోధనా పరికరాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ఈ అభివృద్ధి పనులు దోహదపడతాయని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో భూ విజ్ఞాన శాస్త్రాలు, పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ పూర్తిస్థాయి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

