కలం, ఆదిలాబాద్ : యాసంగి సీజన్లో ఎల్నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎల్ నినో (El Nino) ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను ముందుగానే అంచనా వేసి, వాటికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం ద్వారా కరువు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, సాగు విస్తీర్ణం, వివిధ పంటలకు అవసరమయ్యే నీటి పరిమాణంపై సమగ్ర అంచనా రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, ఫామ్ పాండ్లు, బోర్లు, బావుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని ఆయన సూచించారు.
నీటి లభ్యతకు అనుగుణంగా ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలి, అందుబాటులో ఉన్న నీటితో ఎన్ని రోజులు, ఎన్ని తడులు అందించగలమనే అంశాలపై స్పష్టమైన సాగు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వినియోగం కలిగిన పంటల కారణంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులను క్షేత్రస్థాయిలో కలిసి నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రైతుల బోర్లు, బావులు, ఇతర నీటి వసతి సౌకర్యాల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ ఏఈవోలను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.

