కలం, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు, చీర-సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం స్థానాచార్యుల ఆధ్వర్యంలో పండితులు సీఎం చంద్రబాబుకు పరివేట్టం చుట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగమండపంలో వేదపండితులు సీఎం చంద్రబాబు (Chandrababu) దంపతులకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను బహూకరించారు.
Also Read : ఏలూరులో సొంత పార్టీపై తిరగబడ్డ టీడీపీ నేతలు!
Follow Us On: Youtube

