కలం, వెబ్డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) సీట్ల పంపకాలు కూటమిలో కాక రేపాయి. కూటమి పెద్దల సుదీర్ఘ చర్చల అనంతరం జనసేన (Janasena) 4, టీడీపీ (TDP) 11, బీజేపీ (BJP) 2 కార్పొరేషన్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. అలాగే మున్సిపాలిటీల్లో టీడీపీ 78, బీజేపీ 7, జనసేన 21 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. జనసేనకు కేటాయించిన స్థానాల్లో ఏలూరు మేయర్ స్థానం (Eluru Mayor Seat) కూడా ఉంది. టీడీపీకి ఎంతో పట్టు ఉన్న స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆ స్థానంలో రెడ్డి అప్పలనాయుడుని పోటీలోకి దించుతోంది. దీన్ని టీడీపీ శ్రేణులు మరింత వ్యతిరేకిస్తున్నారు. తరచూ పార్టీలు మారే వ్యక్తికి ఎందుకు ఈ స్థానం ఇచ్చారని మండిపడుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఏలూరులో రోడ్లపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతున్నారు. మేయర్ అభ్యర్థిని తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏలూరులోని టీడీపీ ఆఫీస్లో పార్టీ పరిశీలకురాలు అనురాధా సమక్షంలో పార్టీ నేతలు తమ డిమాండ్లను వెల్లడించారు. ఒక బలహీనమైన పార్టీకి, అభ్యర్థికి టీడీపీ బలంగా ఉన్న స్థానాన్ని కేటాయించడం సరికాదన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నాయకులంతా ఒకేసారి మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేయడంతో కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనురాధా నాయకులను సముదాయించే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది. అధిష్టానం తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ నిర్ణయం మార్చుకోకపోతే ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సీటు (Eluru Mayor Seat) కోసం మొదటి నుంచి టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ ఉంది. కానీ, చివరికి జనసేనకు కేటాయించారు. నేడు అప్పలనాయుడు నామినేషన్ వేస్తారని జనసేనలో చర్చ నడుస్తోంది. టీడీపీ నేతల ఆందోళనల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read : స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవు: అమర్నాథ్
Follow Us On : WhatsApp

