కలం, ఆదిలాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం మావల మండలం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద వివిధ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్, బూత్ స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాలో మార్పులు, మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించారు. కార్యక్రమంలో భాగంగా ఓటరుకు ఫారం -6 ను అందజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల వివరాలను సరిపోల్చుతూ, తొలగించాల్సిన ఓట్లు, మృతిచెందినవారి ఓట్లు, డబుల్ ఓట్ల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా పారదర్శకతతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణు, జీపీఓ శ్రీధర్, బీఎల్ఓలు మంజుల, కావేరి, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.

