కలం, వెబ్ డెస్క్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) భారత్ పర్యటన నేపథ్యంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. “రుబియో తన ఉద్యోగిని ముంబయికి పిలిపించారు. మోదీజీ.. మీ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వారు అయోమయంలో ఉన్నారు. మీరు వారికి అసలు విషయం వివరిస్తారా.. లేకపోతే ఆ పని నన్ను చేయమంటున్నారా?” అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను మార్కో రూబియో ఢిల్లీలో కాకుండా ముంబయిలో కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జైశంకర్ను రూబియో ముంబయికి పిలిపించుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. అక్టోబర్ 19 నుంచి 22వ తేదీ వరకు రూబియో భారత్లో పర్యటించబోతున్నారు.
వెలువడని అధికారిక ప్రకటన..
సాధారణంగా భారత్కు విదేశీ మంత్రులు ఎవరు వస్తున్నా కేంద్ర విదేశాంగ శాఖ పర్యటన వివరాలను ముందే వెల్లడిస్తుంటుంది. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటనపై ఇంతవరకు అలాంటి ప్రకటనేం రాలేదు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్(Randhir Jaiswal)ను వివరణ కోరగా.. ‘సరైన సమయంలో వివరాలు వెల్లడవుతాయని, రూబియో నిర్వహించే సమావేశాల తరువాత ప్రకటనలు విడుదల చేస్తాం’ అని మాత్రమే చెప్పారు. ఈ పర్యటనలో రూబియో ముంబయిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ను కలుస్తారు.
అనంతరం మార్కో రూబియో గుజరాత్ జామ్ నగర్కి వెళ్లి అక్కడ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన ఆయిల్ రిఫైనరీని సందర్శిస్తారు. అంబానీతో పాటు పలువురు వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. రూబియో ఢిల్లీకి రావడం లేదు. ప్రధాని మోదీతో కూడా భేటీ కావడం లేదు. అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు భారత్ పర్యటనకు వచ్చి ప్రధానిని కలవకపోవడం అత్యంత అరుదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : కేంద్రం కీలక నిర్ణయం..పెట్రోల్ ఎగుమతి సుంకం పెంపు!
Follow Us On: Youtube

