1 బార్.. 325 అప్లికేషన్లు!: కలెక్టరేట్‌లో బార్ లాటరీ కేటాయింపు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక 2బి బార్ కేటాయింపు ప్రక్రియను లాటరీ (Kalluru Bar Lottery) విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బార్ కేటాయింపు కోసం ‘డ్రా ఆఫ్ లాట్స్’ నిర్వహించారు.

​కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఒక్క బార్ కేటాయింపు కోసం మొత్తం 325 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా నిబంధనల ప్రకారం ఈ డ్రా నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రతి దశను వీడియో రికార్డింగ్ చేస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

​లాటరీ నిర్వహణలో భాగంగా ప్రతి దరఖాస్తుదారుకు కేటాయించిన టోకెన్ నంబర్‌ను నాణెంపై ప్రదర్శించి, వాటిని ఒక స్టీల్ బాక్స్‌లో ఉంచారు. అనంతరం ఆ బాక్స్ నుండి తీసిన నాణెం ద్వారా విజేతను ఎంపిక చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన చావా తరుణ్ బార్‌ను దక్కించుకున్నారు. ​ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. జానయ్య, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>