గ్రూప్-1 మెయిన్స్ స్కాం కేసులో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం కలిగించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అక్రమాల (APPSC Group 1 Scam) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జవాబు పత్రాల మూల్యాంకనంలో పెద్ద స్కాం జరిగిందనే ఆరోపణలపై ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, అక్రమ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసింది.

దీనిలో ఏపీపీఎస్సీ మాజీ అదనపు కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు పేరును చేర్చడం గమనార్హం. ఆయనతో పాటు మరికొందరి పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అక్రమాలకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూర్యరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

అసలు ఏం జరిగింది..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా పరీక్ష రాసిన వెంటనే ఆన్సర్ షీట్లను సీజ్ చేసి.. అత్యంత గోప్యత, భద్రత ఉండే ప్రదేశాల్లోనే పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఏకంగా 84 రోజుల పాటు ఒక ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలో మెయిన్స్ పేపర్లను పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతేగాకుండా, ఎలాంటి అర్హత లేని 66 మంది ప్రైవేట్ టీచర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మెయిన్స్ పరీక్షలను దిద్దించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

కొంతమంది అభ్యర్థులకు ముందే మార్కులు నిర్ణయించి వేశారని కూడా గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లించిన రూ.1.14 కోట్లకు సంబంధించిన పత్రాలు మాయం అయ్యాయి. ఇందుకు అప్పటి అదనపు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులును ప్రధాన బాధ్యుడిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>