కలం, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ఘట్టం ఉద్రిక్తతలకు దారితీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)తో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం రాళ్లదాడికి పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది.
ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. నామినేషన్లు వేయకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, అక్కడ ఉన్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి ఘటనతో పుంగనూరు ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది.

