కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సీసీఎస్ బకాయిలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించాల్సిన బాధ్యతను తీసుకుంటోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సీసీఎస్ పాత బకాయిలకు సంబంధించి ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సంస్థ అభివృద్ధి అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోం..
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఎదురైన సమస్యలను తెలంగాణలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల నేతలు సంస్థ అభివృద్ధికి కట్టుబడి ఉంటూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

