కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలోని చెరువులను నింపేందుకు వెంటనే శ్రీరాంసాగర్ (Sriram Sagar Project) నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) డిమాండ్ చేశారు. వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుత్ప, అలీసాగర్, లక్ష్మి కాలువ లిఫ్టులను పూర్తి సామర్థ్యంతో నడపకపోతే రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎల్ నినో సాకు ఒక బూటకమని, ఏపీలో లేని కరెంటు కష్టాలు తెలంగాణాలో ఎందుకని ప్రశ్నించారు.
నాడు కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కాగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం 6 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంటు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలన్నర రోజులుగా రైతులు సబ్ స్టేషన్ల ఎదుట, రోడ్లపై బైఠాయించి కన్నీరు మున్నీరవుతుంటే ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచు కునేసరికి సమీక్ష పేరుతో అధికారులను సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, నాయకులు రేగుంట దేవేందర్, కల్లెడ ఏలియా, నాగధర్రెడ్డి, బద్దం నర్సారెడ్డి, చౌట్పల్లి రవి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

