కలం, కరీంనగర్: చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతాంగం తీవ్ర అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ (BJP) తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాల కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గురువారం కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపి, కరీంనగర్ జిల్లా ప్రబారి శాంతి కుమార్, సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి మోహన్ రెడ్డి, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి కనబోయిన ఓదేలు, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కోమల ఆంజనేయులు హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హాజరయ్యారు.
అప్రకటిత విద్యుత్ కోతలు, సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సమావేశంలో నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈనెల 23న కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి, భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలు ‘ఓట్ చోరీ’ పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఖండించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై చేస్తున్న అనవసర ఆరోపణలు, రగడకు క్షేత్రస్థాయిలో ధీటైన సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ నెలాఖరులో పోలింగ్ కమిటీ బాధ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.

