కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక పరిధిలోని బొమ్మకల్ సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను పురస్కరించుకుని గురువారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బొమ్మకల్ లో పర్యటించారు.
ఈ ప్రాంత ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో బొమ్మకల్ ప్రాంతంలోని బతుకమ్మ ఆడే పాయింట్లతో పాటు చెరువు కట్ట ప్రాంతంలో గల నిమజ్జనం పాయింట్లను సందర్శించారు. ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో చేసిన ఏర్పాట్లను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.
బతుకమ్మ ఆడే పాయింట్లతో పాటు చెరువు కట్ట నిమజ్జనం ఘాట్ వద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్, భారికేడింగ్, చదును, త్రాగు నీటి వసతి తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పరిదిలో పలు ప్రాంత ఆచార వ్యవహారాలకు అనుగుణంగా తొమ్మిది రోజులు, ఏడు రోజులలో జరిగే పవిత్రమైన సద్దుల బతుకమ్మ పండగను నగర ఆడపడుచులు, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మద్య ఘనంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు.
తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయ పండగైన సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో 2.80 కోట్ల నిధులతో గతం కంటే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం రోజు బొమ్మకల్ ప్రాంతంలో జరిగే ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బొమ్మకల్ ప్రాంతంలోని బతుకమ్మ పాయింట్లతో పాటు నిమజ్జనం ఘాట్ ల వద్ద చదును కార్యక్రమాలు, మహిళలు ఆడుకునేలా చక్కటి సౌండ్, లైటింగ్ సిస్టమ్, సులభంగా బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఘాట్ వద్ద తగినంత వెలుతురు ఉండేలా భారీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
నిమజ్జనం సమయంలో అవాంనీయ ఘటనలు జరగకుండా బారీకేడింగ్ తో బధ్రత ఏర్పాట్లు, నిమజ్జనం ఘాట్ వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక పారిశుధ్యం, వచ్చే వారికి త్రాగు నీటి సౌకర్యం లాంటి తదితర అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహిళలు, ప్రజలకు వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్కోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బతుకమ్మ నిమజ్జనం ఘూట్ వద్ద నగరపాలక సంస్థ అధికారులు, కార్మీక సిబ్బందిని కూడ అప్రమత్తం చేశామని తెలిపారు.
ఏడు రోజుల సద్దు బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ ద్వారా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఉయ్యాల పాటలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడి.. ప్రశాంత వాతావరణం లో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చాలని మేయర్ ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ పరిదిలోని బొమ్మకల్ ప్రజలందరికీ ఏడు రోజుల సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల వెంకటేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

