కలం, నకిరేకల్ : సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తారని భావిస్తే, కేటీఆర్ అక్కడకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) విమర్శించారు. కేవలం గడ్డం పెంచుకుని, వేషధారణ మార్చినంత మాత్రాన ప్రజల విశ్వాసాన్ని పొందుతామనుకోవడం కేటీఆర్ పొరపాటని ఎద్దేవా చేశారు. గురువారం నాడు వీరేశం మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ఇటీవలి పర్యటనలు, వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘కేటీఆర్ (KTR) సింగరేణికి వెళ్లింది కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికా? లేక సినిమా ప్రమోషన్ కోసమా?’ అని ప్రశ్నించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే సిరులు కురిపించే సింగరేణి సంస్థను విచ్చలవిడిగా దోచుకున్నారని, కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే సంస్థకు తీరని ద్రోహం జరిగిందని ఆరోపించారు. అలా దోచుకున్నవారే నేడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేటీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఫార్ములా-ఈ కార్ రేసు(Formula E Car Race)తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై స్వయంగా ఈడీ విచారణ కోరుతూ లేఖ రాయాలని వీరేశం సవాల్ విసిరారు.
సొంత తప్పులపై సమాధానం చెప్పలేకనే కేటీఆర్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వీరేశం మండిపడ్డారు. తనకు మూడు హోటళ్లు ఉన్నాయని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ విషయాన్ని ఇన్నాళ్లూ ఎందుకు దాచారో సమాధానం చెప్పాలని డిమాండ్ ఆయన చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డి కారణమనడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. “గతంలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు దానికి కేసీఆరే కారణమని మేము ఆరోపించామా?” అని ప్రశ్నించిన వీరేశం, ‘ఎల్ నినో’ వంటి ప్రకృతి పరిస్థితులను కూడా రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
కేసీఆర్ త్వరలోనే ఫామ్ హౌస్ దాటి ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ చెబుతుంటే, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వదిలే ప్రసక్తే లేనట్లు వ్యవహరిస్తున్నారని వేముల వీరేశం వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదని, అందుకే కాంగ్రెస్కు పట్టంగట్టారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, విజన్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు.
Also Read : రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
Follow Us On : WhatsApp

