కలం, వెబ్ డెస్క్: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ (Kanaka Durga Temple)కు భక్తుడు బంగారు కిరీటం కానుకగా సమర్పించారు. కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు దుర్గా శ్రీనివాస్ గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి పర్వదినాన సుమారు రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి అలంకరించేందుకు ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గా శ్రీనివాస్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లు పొదిగిన నవరత్న కిరాటాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 494 గ్రాముల బంగారంతో ఈ కిరీటాన్ని రూపొందించారు. దుర్గామాత దయవల్లే ఈ కానుకను అమ్మవారికి సమర్పించుకోగలిగామని.. ఈ అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని దాతలు తెలిపారు.
కాగా, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. గురువారం కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చారు. సాయంకాల సమయం నుంచి అమ్మవారి ఆలయం (Kanaka Durga Temple) విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతుంది. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ భద్రత ఏర్పాటు చేసింది.
Also Read : సారీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కారణమిదే!
Follow Us On: Youtube

