కలం, వెబ్డెస్క్: ఏపీ , ఒడిశా రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా తెలుగు నేర్చుకోవడం కష్టమేనని, అయినా తాను త్వరలో తెలుగు నేర్చుకుంటానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళా (National SARAS Mela)ను నేడు రాష్ట్రపతి సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ వెలుపల తొలిసారి 1500 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలతో ఈ మేళా నిర్వహించారు. ఇక్కడ సుమారు 650కి పైగా స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను రాష్ట్రపతి దగ్గరుండి పరిశీలించారు. మేళాలోని ఓ స్టాల్లో స్వయంగా ఆమె చీరను కొనుగోలు చేశారు. ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల పని తీరును కొనియాడారు. అభివృద్ధి ఫలాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేయడంలో సంఘాలు, సరస్ మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరడం ఎంతో అవసరమని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. సరస్ మేళాలు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లుగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. వీటి ద్వారా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు దేశవ్యాప్తంగా వినియోగదారులతో నేరుగా అనుసంధానం ఏర్పడిందని, పట్టణ మార్కెట్లతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు లభించాయని తెలిపారు. తద్వారా వారి మార్కెటింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా మారిందని వెల్లడించారు. గ్రామీణ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “లఖ్పతి దీదీ” కార్యక్రమం కొత్త దిశానిర్దేశం చేస్తోందని వ్యాఖ్యానించారు. నేడు గ్రామీణ మహిళలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా, సంపదను సృష్టించే శక్తులుగా ఎదుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

