కలం, హనుమకొండ : చిరు వ్యాపారుల (Small Traders) దుకాణాల కూల్చివేతలను నిలిపివేసి, వారి జీవనోపాధిని కాపాడాలని బీఆర్టీయూ, చిరు వ్యాపార సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో ప్రత్యేక సంతలు, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈసందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హయాంలో మూడేళ్లుగా చిరు వ్యాపారులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.
పండ్ల దుకాణాల కూల్చివేతలతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని, బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. కంటి తుడుపు చర్యలు కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ స్థాయిలో సమావేశం నిర్వహించి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుడు ఎస్కే మహమూద్ మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించిన పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
అధికారులే కూల్చివేతలు చేస్తుంటే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, చిరు వ్యాపార సంఘాల నాయకులు మహమ్మద్ ముర్తజా, హరిచంద్రు, మోయిన్, నాయీముద్దీన్, ఇంజాల మల్లేశం, తేలు సారంగపాణి, పాలడుగుల శివకుమార్, సిరికొండ బిక్షపతి, ఎండీ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : సారీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కారణమిదే!
Follow Us On: Youtube

