కలం, వెబ్ డెస్క్: మహిళలు అభివృద్ధి చెందితేనే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. నారీ శక్తి నవభారత శక్తి అని కొనియాడారు. విజయవాడలో ‘జాతీయ సరస్ అజీవికా మేళా-2026’లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల ఆదాయం పెంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ‘సరస్ మేళా’ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో జరిగే ఇలాంటి మేళా తొలిసారి విజయవాడలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా నదీ తీరాన జరుగుతున్న సరస్ మేళా నిర్వహణ ఏపీకి మరింత శోభ తెచ్చిందన్నారు. మహిళలు లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నామని తెలిపారు.
రాష్ట్రపతి జీవితమే అందరికీ ఆదర్శం..
దేశ మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జీవితమే ఆదర్శమని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. ప్రజా సేవలో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మహిళలు సాధించలేని రంగమంటూ లేదన్నారు. అంతరిక్షంలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారని.. ఇటీవల ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతి కూడా భారతీయ మూలాలున్న నవీ పిళ్లైకి దక్కడం అందరికీ గర్వకారణమన్నారు. ప్రతి మహిళ తాను అనుకున్న రంగంలో రాణించేలా ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తోందన్నారు. నిన్నటి పొదుపు సంఘాలే నేటి వ్యాపార సంస్థలుగా మారాయని వివరించారు.
Also Read : సారీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కారణమిదే!
Follow Us On: X(Twitter)

