నల్లగొండ కార్పొరేషన్‌లో బోగస్‌ ఉద్యోగాల దందా!

‎‎కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ (Nalgonda Corporation)లో బోగస్ ఉద్యోగుల దందా చేస్తూ.. ప్రజా ధనం లూటీ చేస్తున్న కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. శానిటేషన్ విభాగం కేంద్రంగా బినామీ ఉద్యోగులు ఉన్నట్టు తేలడం ప్రస్తుతం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రోడ్లపై రోజంతా చెమటోడ్చి పని చేసే కార్మికులు ఒకవైపు.. నెలలో ఒక్క రోజైనా విధులకు రాని బోగస్ కార్మికులు మరోవైపు రికార్డుల్లో ఉద్యోగులుగా చెలామణి అవుతూ వేతనాలు కాజేస్తున్నట్టు తేలింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో బినామీల పేరిట జీతాలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే.. పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది కొరత ఉందని అంటుండగా.. రికార్డులు మాత్రం వందలాది మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెబుతున్నాయి.

తెరవెనుక ఉండే చక్రం తిప్పుతుండగా..

బోగస్ ఉద్యోగుల వ్యవహారం ఇప్పటికే కొంతవరకు బయటపడిందని అనుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. బినామీ బాగోతం పూర్తిగా వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని కొందరు తెరవెనుక పెద్దలు ఆందోళన చెందుతున్నారు. బయటకు పొక్కకుండా కాపాడుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండాపైకి అంతా సవ్యంగానే జరుగుతున్నట్లు నమ్మిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు తెరవెనుక శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సిబ్బందిలోనే చర్చలో ఉంది. ఇన్నాళ్లు ఎవరికీ అంతుచిక్కని బినామీ దందాకు తాజాగా బ్రేక్ పడేలా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.

జీతాల చెల్లింపు విధానంలో మార్పులు..

మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది వేతనాల చెల్లింపు విధానంలో ఇటీవల అధికారులు కీలక మార్పులు చేపట్టారు. కొత్త నిబంధనల మేరకు మహిళా సంఘాల (మెప్మా గ్రూపులు) ద్వారా చెల్లించాలని, బయోమెట్రిక్ (ఫేస్ రికగ్నిషన్) హాజరు ఉన్న వారికే వేతనాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇది తెరపైకి రావడంతోనే బినామీలను కాపాడేవారు ఆందోళనలో పడిపోయారు. ఏ ఒక్కరోజూ విధులకు రాని బోగస్ ఉద్యోగులకు ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న ఇబ్బందిపెడుతోంది.

ఒకవేళ క్షేత్రస్థాయికి వచ్చి హాజరు వేసినా, వారి వ్యవహారం వెలుగులోకి రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కఠిన నిబంధనలు అమలు చేస్తే ఇప్పటివరకు బోగస్ సిబ్బంది పేర్లతో డ్రా అయిన జీతాలకు సంబంధించిన కోట్ల రూపాయల లూటీ బయటపడుతుందని, అందుకే ప్రక్రియను ఎలాగైనా నీరుగార్చాలని తెరవెనుక శక్తులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

విజిలెన్స్ విచారణకు డిమాండ్..

కార్పొరేషన్‌లో తిష్టవేసిన బినామీలను పూర్తిగా పెకిలించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపైనే ఉంది. పారిశుద్ధ్య విభాగంలోని ప్రతి సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తేనే అసలు ఉద్యోగులు ఎవరో, బినామీలు ఎవరో తేలుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించి బినామీల దందాను కాపాడే శక్తులను, ప్రజాధనం కొల్లగొడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రజలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>