ఇసుకతో కాసుల వర్షం: 6 నెలల్లో రికార్డు ఆదాయం!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఖనిజాల శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం (Telangana Sand Revenue) సమకూరింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,008 కోట్ల ఆదాయం రాగా, 2026–27 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లోనే రూ.591 కోట్లు వచ్చినట్లు అందుబాటులో ఉన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇసుక కొనుగోలులో వినియోగదారులకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం, విక్రయాల్లో పారదర్శకత పెంచడం, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌, ఇసుక బజార్ల ఏర్పాటు, రవాణాపై సాంకేతిక నిఘా ఇందులో ప్రధానమైనవి. వీటివల్లే ఆదాయం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరుల్లో ఇసుక విక్రయాలు కూడా కీలకమైనవి. అందుకే ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆదాయానికి గండికొడుతున్న లోపాలను సరిదిద్దేందుకు సంస్కరణలు చేపట్టింది. గత రెండేళ్లుగా ఈ చర్యలు అమలవుతుండటంతో ఇసుక విక్రయాల ఆదాయం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇసుక సరఫరా, విక్రయాలు, రవాణా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. దీనిల్ల సరఫరా వివరాలను పర్యవేక్షించడంతో పాటు విక్రయాలపై నియంత్రణ పెంచే అవకాశం ఏర్పడుతోంది. అలాగే, నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా ‘ఇసుక బజార్ల’ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ పరిసరాల్లో ఈ కేంద్రాల ద్వారా సరఫరాను మెరుగుపరిచేందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. నిర్ణీత కేంద్రాల నుంచి ఇసుక సరఫరా చేయడం వల్ల కొనుగోలు ప్రక్రియ సులభతరం కావడంతో పాటు సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడమూ వీలవుతుంది.

అక్రమ రవాణాకు చెక్‌

ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇసుక నిల్వ కేంద్రాలు, కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. వేబ్రిడ్జిలను మైన్స్‌ సర్వైలెన్స్‌ సిస్టంతో అనుసంధానించడం ద్వారా వాహనాల్లో తరలించే ఇసుక పరిమాణాన్ని పర్యవేక్షించవచ్చు. ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా వాటి ప్రయాణ మార్గాలు, కదలికలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ చర్యలు అక్రమ రవాణా, అధిక లోడింగ్‌ వంటి సమస్యలను నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నాయి.

పటిష్ఠ పర్యవేక్షణతో పారదర్శకత

ఇసుక సరఫరాలో పారదర్శకతను పెంచడం, అక్రమ రవాణాను నియంత్రించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఖనిజాల శాఖ చర్యలు చేపడుతోంది. మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ చర్యలు సమర్థంగా అమలయ్యేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడటం, సరఫరా, ఆదాయ గణాంకాలను క్రమం తప్పకుండా సమీక్షించడం కూడా కీలకంగా మారాయి. ఈ చర్యలతో వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటులో ఉంచడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసుందకు, ప్రభుత్వ ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.

నెలవారీ ఇసుక ఆదాయం

నెల          ఆదాయ లక్ష్యం    వాస్తవ ఆదాయం   అదనపు ఆదాయం

ఏప్రిల్‌       రూ.81 కోట్లు         రూ.102 కోట్లు         రూ.21 కోట్లు
మే            రూ.89 కోట్లు          రూ.112 కోట్లు        రూ.23 కోట్లు
జూన్‌         రూ.103 కోట్లు        రూ.133 కోట్లు         రూ.30 కోట్లు
జూలై        రూ.74 కోట్లు         రూ.102 కోట్లు         రూ.28 కోట్లు
ఆగస్టు        రూ.62 కోట్లు         రూ.72 కోట్లు           రూ.10 కోట్లు
సెప్టెంబరు  రూ.52 కోట్లు           రూ.70 కోట్లు          రూ.18 కోట్లు
మొత్తం      రూ.461 కోట్లు        రూ.591 కోట్లు         రూ.130 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>