సాయన్న ఆశయాలు అంద‌రికీ ఆదర్శం: మంత్రి శ్రీహ‌రి

కలం, మహబూబ్‌న‌గ‌ర్ బ్యూరో: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగల సాయన్న (Pandugala Sayanna) ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) పిలుపునిచ్చారు. నవాబ్ పేట మండల కేంద్రంలో పండుగల సాయన్న విగ్రహాన్ని మంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. పండుగల సాయన్న ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితమైన నాయకుడు కాదని, సమాజంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని పేర్కొన్నారు. పేదల ఆకలి బాధలను అర్థం చేసుకొని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే పండుగల సాయన్న గొప్పతనమని అన్నారు. కుల‌మ‌త భేదాలు చూడకుండా, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేసిన మహనీయుడని కొనియాడారు.

పండుగల సాయన్నను ఒక కులానికో, మ‌తానికో పరిమితం చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధులు కూడా సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. వీరందరి జీవితాలు సమాజంలోని అణగారిన వర్గాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. నిజాం పాలనలో పేదల పక్షాన నిలబడి, అన్యాయాన్ని ఎదిరించిన పండుగల సాయన్న స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని, పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు.

సాయన్నకు ప్రభుత్వ గుర్తింపు చ‌రిత్రాత్మకం

తెలంగాణలో పండుగల సాయన్నకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన విషయమని మంత్రి పేర్కొన్నారు. పండుగల సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ముదిరాజ్‌ సమాజానికి న్యాయం జరిగేలా, వారి చిరకాల ఆకాంక్ష అయిన బీసీ-డీ వర్గీకరణ అంశంపై కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ముదిరాజ్‌ సమాజం విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మహబూబ్‌న‌గ‌ర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>