కలం, ఖమ్మం బ్యూరో: ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం (Khammam) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో బుధవారం ఆడపిల్లల జన్మోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి పాలేటి ప్రమీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజా వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన 50 మంది బాలింతలకు బేబీ కిట్లను అందించారు. ఈ కిట్లలో ఆడపిల్లలకు అవసరమైన దుస్తులు, టవల్స్, ఇతర నిత్యావసర వస్తువులతోపాటు బాలింతలకు సరిపడా పండ్లను పంపిణీ చేశారు.
ఆడపిల్లల జననాన్ని సంతోషంగా స్వాగతించడం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, బాలికల సంరక్షణ, నాణ్యమైన విద్య, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆడపిల్లలు కుటుంబానికి, సమాజానికి గర్వకారణమన్నారు. బాలికల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

