కరీంనగర్ నామినేటెడ్ MLC.. ఎవరికి దక్కేనో ‘గవర్నర్ కోటా’?

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ (Governor Quota MLC) స్థానాలకు గడువు నవంబరు రెండో వారంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ పదవులను చేజిక్కించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఇటీవల సిరిసిల్లలో సీఎం ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రధాన ఆశావహులు తెరపైకి వచ్చారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం ఉమ్మడి కరీంనగర్ లో ప్రధానంగా మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, ప్రోటోకాల్ పౌరసంబంధాల సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరికి చాన్స్ దక్కే అవకాశమున్నట్లు గట్టి సంకేతాలున్నాయి. బీసీ కోటాకే ప్రాధాన్యమిస్తే సత్తు మల్లేశం (Sattu Mallesham) ముందు వరుసలో ఉన్నట్లేనని తెలుస్తోంది.

కుల సమీకరణాలు..

ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, కుల సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు మంత్రులున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్(Arepally Mohan), ఎస్సీ (మాదిగ) కోటాలో తనకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి, పద్మశాలి కులానికి ఈసారి ప్రాతినిధ్యం దక్కాల్సి ఉందనే చర్చ నడుస్తోంది. అయితే బీసీ మున్నూరు కాపు కులానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం బిసి కోటాలో పదవిని ఆశిస్తున్నారు.

సిరిసిల్ల పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ వర్గానికి మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని సైతం చెప్పారు. మరో వైపు ఉమ్మడి జిల్లా పరిధిలోని రామగుండంకు చెందిన హార్కర్ వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రోటోకాల్ వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు ఢిల్లీ స్థాయి అగ్రనేతలతో ఆయనకున్న సంబంధాలు ఆయనకు కలిసివస్తాయని భావిస్తున్నారు.

పద్మశాలీలకు పెద్ద పీట వేస్తే..

సిరిసిల్ల పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత రాజన్న, హైకోర్టు న్యాయయవాది గుడ్ల జ్యోతి కిరణ్ లు పద్మశాలి సామాజిక వర్గంలో గుర్తింపు పొందిన కుటుటుంబ వారసులు.. అయితే రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రాధాన్యతను పెంచుకుంటూ ఓటు బ్యాంకు కోసం పద్మశాలీలకు పెద్ద పీట వేస్తే ఇందులో ఒకరికి చాన్స్ లభించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మంత్రి వర్గం.. సీఎం ‘ఆశీస్సులు’ ఎవరికి?

ఈ నామినేటెడ్ (Governor Quota MLC) పదవుల భర్తీలో జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల పాత్ర అత్యంత కీలకమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వద్దకు ఈ ముగ్గురు నేతలు తమ ప్రతిపాదనలు తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సత్తు మల్లేశంకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు గట్టిగా ఉన్నాయని, సామాజిక సమీకరణాల విశ్లేషణ తర్వాత ఆయనకే అవకాశం దక్కవచ్చని ఒక చర్చ నడుస్తోంది.

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి అధిష్టానం పెద్దలతో ఉన్న సంబంధాలను కూడా కొందరు నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం సత్యనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చింది. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డితో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాల రీత్యా ఆయన కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తన అభ్యర్థిత్వాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.

ఆదిపత్యమెవరిదో?

ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల కనుసన్నల్లోనే ఈ లాబీయింగ్ నడుస్తోంది. ఎవరికి ఈ పదవి దక్కినా అది ఆయా మంత్రుల వర్గాల ఆధిపత్యానికి అద్దం పడుతుంది. ముఖ్యంగా జిల్లాలో తమ వర్గానికి చెందిన నేతకు ఈ పదవి దక్కించుకోవడం ద్వారా భవిష్యత్తు స్థానిక సంస్థలు, తదుపరి ఎన్నికలపై పట్టు సాధించాలని మంత్రులు కూడా అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ ఎమ్మెల్సీ రేసు కేవలం పదవుల పంపకం మాత్రమే కాదు.. ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్‌లో ఎవరు బలమైన నాయకులు, ఎవరి వెనుక ఏ నాయకుడి ఆశీస్సులున్నాయి? అనేదానిపై జరుగుతున్న ఒక అంతర్గత ఆధిపత్య పోరుగా దీన్ని విశ్లేషించవచ్చు. ముగ్గురు సీనియర్ నాయకులు చెరో సామాజిక వర్గానికి (ఎస్సీ, బీసీ, బ్రాహ్మణ) ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమీకరణానికి మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మరో 15 నుండి 20 రోజుల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చి అధిష్టానం తుది నిర్ణయం ప్రకటించనుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read : గుడిలోకి రానివ్వ‌ని వారిపై కేసు ఫైల్ చేయాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>