కలం, ఖమ్మం బ్యూరో : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో (Gajalakshmi Alankaram) భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలందుకున్నారు. గజలక్ష్మి అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించిన పురాణ విశేషాలను అర్చకులు వివరించారు. పూర్వం దుర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రుడు తన సంపదను కోల్పోయాడని, అనంతరం శ్రీమహావిష్ణువు సూచన మేరకు క్షీరసాగర మథనం చేపట్టగా సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి గజలక్ష్మి రూపంలో ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఏనుగులు తమ కుంభస్థలాల నుంచి జలంతో అమ్మవారికి అభిషేకం చేసినట్లు పురాణ కథనాలు పేర్కొంటున్నాయి.
కమలాసనంపై ఆసీనులై, వరదాభయ హస్తాలతో, రెండు చేతుల్లో పద్మాలను ధరించి దివ్య అలంకారంలో విరాజిల్లే గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. గజలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించడం శుభప్రదమని వేద, వాస్తు సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా భద్రాచలానికి విచ్చేస్తున్న భక్తులు గజలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి కృపతో సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

