కలం, హనుమకొండ: కాజీపేట వైఎస్ఆర్ నగర్లో (YSR Nagar) 22 ఏళ్లుగా నివాసం ఉంటున్న గుడిసె వాసులకు నివాస స్థలాలపై పట్టాలు మంజూరు చేసి, అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు సుమారు 100 మంది సంతకాలతో మెమోరాండం సమర్పించారు.
కాజీపేట చౌరస్తాను ఆనుకుని ఉన్న కడిపికొండ శివారులోని సర్వే నంబర్లు 71, 72, 73లోని ప్రభుత్వ సీలింగ్ భూమిలో 2005 నుంచి పేద, బలహీన వర్గాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని వీకర్ సెక్షన్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నివాసితులకు మున్సిపల్ ఇంటి నంబర్లు మంజూరయ్యాయని, ఆధార్, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ తదితర గుర్తింపు పత్రాలు కూడా అదే చిరునామాతో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
22 ఏళ్లుగా నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు స్థలాలపై హక్కు పత్రాలు లేకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు స్థల పరిశీలన, సమగ్ర విచారణ నిర్వహించి అర్హులకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి శాశ్వత నివాస భద్రత కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీకర్ సెక్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసునూరి మనోహర్, హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుస్తో పాటు వైఎస్ఆర్ నగర్ గుడిసె వాసులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

