హైకమాండ్ మార్క్ స్కెచ్: మీనాక్షి స్థానంలో ఎవరు?

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ ప్లేస్‌లో హైకమాండ్ ఎవరిని నియమిస్తుంది? ఎప్పుడు ప్రకటన రావొచ్చు? దక్షిణాది నుంచి వస్తారా? లేక ఉత్తరాదికి చెందినవారా?.. ఇలాంటి సందేహాల నడుమ పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ లీడర్లు ముకుల్ వాస్నిక్, మనీశ్ తివారీ పేర్లు తొలుత వినిపించగా.. ఇటీవల దక్షిణాదికి చెందిన చెల్ల కుమార్, ఎంపీ జ్యోతిమణి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

తాజాగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ పేరు వినిపిస్తున్నది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి వార్ రూమ్ ఇన్‌చార్జిగా, మీడియా-కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జిగా వ్యవహరించిన అజయ్ కుమార్‌ను నియమించే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. దాదాపు నెల రోజులుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి లేరు. సంస్థాగత మార్పులపై సీరియస్‌గా దృష్టిపెట్టిన పార్టీ హైకమాండ్.. త్వరలోనే మీనాక్షి స్థానంలో కొత్త ఇన్‌చార్జిని నియమించనున్నట్లు ఢిల్లీలోని ఇందిరా భవన్ వర్గాల సమాచారం.

తెలంగాణ రాజకీయాలపై అవగాహన

తెలంగాణ రాజకీయాలపై అజయ్ కుమార్‌‌కు అవగాహన ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే మకాం వేసి హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులను విశ్లేషించి వార్ రూమ్ ఇన్‌చార్జిగా ‘కాంగ్రెస్ సోషల్ వారియర్’లకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్, ఇమేజెస్ రూపంలో సోషల్ మీడియా కంటెంట్‌ క్రియేషన్‌లో భిన్నమైన తీరులో గైడ్ చేశారు.

రాష్ట్రంలో ఏ పార్టీకి గ్రౌండ్‌లో ఎలాంటి బలం ఉన్నదో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులేంటో స్పష్టమైన అవగాహన ఉన్న అజయ్ కుమార్‌ను ఇప్పటి అవసరాల దృష్ట్యా తెలంగాణకు ఇన్‌చార్జిగా పంపించడంపై హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ముకుల్ వాస్నిక్, మనీశ్ తివారీ, చెల్ల కుమార్, జ్యోతిమణి.. వీరందరికీ తెలంగాణ పాలిటిక్స్ కొత్త. ఇక్కడ నియమితులైన తర్వాత స్టడీ చేసి స్టేట్ కేడర్‌ను, లీడర్లను గైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అజయ్ కుమార్ విషయంలో అలాంటి అవసరం లేదు. చాలా రాష్ట్రాల్లో పార్టీలో సంస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టిన హైకమాండ్.. ఇక తెలంగాణ ఇన్‌చార్జి విషయంలోనూ తొందరగానే నిర్ణయం తీసుకోవచ్చన్నది గాంధీభవన్‌లో వినిపిస్తున్న మాట.

వచ్చే ఎన్నికలే ప్రధాన టాస్క్

కాంగ్రెస్ హైకమాండ్ అన్ని కోణాల నుంచి ఆలోచించి, స్టేట్ ఇన్‌చార్జి నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. రానున్న రోజుల్లో జరిగే జీహెచ్ఎంసీ, జిల్లా-మండల పరిషత్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు (ఒకవేళ వస్తే), ఆ తర్వాత ఫైనల్‌గా 2028 డిసెంబర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే ఇన్‌చార్జికి పని ఉంటుందన్నది అధిష్టానం ఆలోచన. రాష్ట్రంలోని నేతలకు కూడా అజయ్ కుమార్ పరిచయస్తుడే కావడం, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉండడం ఇన్‌చార్జిగా నియమించడంలో కలిసొచ్చే అంశం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>