కలం, వెబ్ డెస్క్ : స్థానిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలు జనసేన (Janasena) పార్టీలో చేరారు. దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలక భూమిక వహిస్తున్న సీనియర్ నేత యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ అధికారికంగా నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన యనమల కృష్ణుడు జనసేన బాట పట్టడం స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన చేరికతో తుని ప్రాంతంలో పార్టీకి సరికొత్త బలం చేకూరినట్లయింది. అదే విధంగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నవీన్ నిశ్చల్ కూడా జనసేనలో చేరడంతో ఆయా జిల్లాల పరిధిలోని నాయకుల్లో, కేడర్‌లో తీవ్ర ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా పార్టీలోకి నూతనంగా వచ్చిన నేతలకు పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో పాత, కొత్త నాయకులందరినీ కలుపుకొని, సమష్టిగా పనిచేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని నాయకులంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలని ఆయన స్పష్టం చేశారు.

