కలం, ములుగు : గోవిందరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ ఎన్. సృజన్ కుమార్‌ను (Govindaraopet Tahsildar) ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భూమి పౌతి మార్పిడి కోసం రూ.14 వేల లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం అందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావుపేట మండల పరిధిలోని ఓ భూమికి సంబంధించి ఎకరం 5 గుంటల భూమి యజమాని తండ్రి మృతి చెందడంతో, ఆ భూమిని వారసురాలైన కుమార్తె పేరుపై పౌతి మార్పిడి చేసి పట్టా చేయించేందుకు సంబంధిత కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. భూమి పౌతి మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.14 వేల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో భూమి యజమానులు ఏసీఐ అధికారుల్ని ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గోవిందరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సంబంధిత రికార్డులు, దస్త్రాలను పరిశీలించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ ఎన్. సృజన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, భూమి పౌతి మార్పిడి వంటి సాధారణ రెవెన్యూ సేవలకు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పట్టుబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న నగదు తదితర అంశాలపై ఏసీబీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

