కలం, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, డ్రా ప్రక్రియలో అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు ఎంఐఎం ఎమ్మెల్యేలకు భయపడి పనిచేస్తున్నారని, తమ లాంటి ప్రజాప్రతినిధులకు సభలోనూ, బయటా కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి మంజూరైన ఇళ్లను వేరే నియోజకవర్గాల వారికి కేటాయించారని, లక్కీ డ్రా నిర్వహణలో నిబంధనలు పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేసినా ‘కూల్’ అని సరిపెడుతున్నారని వాపోయారు.
తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీపై ఫిర్యాదు
మరోవైపు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్‌పై దానం నాగేందర్ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఎండీ గౌతమ్ స్పీకర్ కార్యాలయంలోనే మర్యాద లేకుండా, క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించారని మండిపడ్డారు. శాసనసభలో జీరో అవర్‌కు విలువ లేకుండా పోయిందని, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని, అధికారులు కేవలం నోట్ చేసుకోవడానికే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

