కరీంనగర్‌లో దోమల బెడద.. వాహనాలపై వివాదం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో (Karimnagar) పారిశుధ్య నిర్వహణ, దోమల నియంత్రణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమకూర్చిన వాహనాల (Municipal Vehicles) వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు, మరోవైపు దోమల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఫాగింగ్‌ యంత్రాలు, చెత్త సేకరణ వాహనాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దోమల నియంత్రణ కోసం కొత్తగా రెండు ఫాగింగ్‌ యంత్రాలను సమకూర్చినప్పటికీ అవి పూర్తిస్థాయిలో రోడ్డెక్కడం లేదని విమర్శలు వస్తున్నాయి.

డీజిల్‌ కేటాయింపులు, ఫాగింగ్‌ నిర్వహణపై కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొత్తగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ ఆటోలు వినియోగంలోకి రాకుండా ఒకేచోట నిలిపి ఉంచారని ఆరోపిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం నగరపాలక సంస్థ నిధులతో కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోల నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. వాహనాలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు డిపాజిట్‌ పేరుతో నగదు వసూలు చేస్తున్నారని, ఈ కారణంగానే వాహనాలు వినియోగంలోకి రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

కమిషన్ల కక్కుర్తే కారణమా? – మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

వాహనాల కొనుగోలు, టెండర్‌ ప్రక్రియ, వాటి నాణ్యత, డీజిల్‌ బిల్లులు, వాహనాల వినియోగ రికార్డులపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. వాహనాల కొనుగోలు వ్యవహారంలో మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌పై ఆరోపణలు వస్తున్నాయని, ఒక్కో వాహనానికి ముందస్తు చెల్లింపులపై కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాధనం వృథా కాకుండా మూలనపడ్డ వాహనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, దోమల నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని ఆయన కోరారు. వాహనాల కొనుగోలు, నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

వాహనాలు అమ్మడం లేదు: మేయర్ కొలగాని శ్రీనివాస్

మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కొత్తగా సమకూరిన ఫాగింగ్‌, చెత్త సేకరణ వాహనాలను విక్రయిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ (Kolagani Srinivas) స్పష్టం చేశారు. వాహనాలకు ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్‌, నంబర్‌ కేటాయింపు, బీమా తదితర అధికారిక ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరుసగా ఐదు రోజుల సెలవులు రావడంతో స్వల్ప జాప్యం జరిగిందని, ప్రక్రియ పూర్తయిన వెంటనే వాహనాలను ప్రజల సేవలోకి తీసుకువస్తామని చెప్పారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా సమకూర్చిన ఆటోలకు సంబంధించి రూ.2 లక్షల అడ్వాన్స్‌ తీసుకునే విధానం కొత్తగా తీసుకొచ్చింది కాదని, గతం నుంచే అమల్లో ఉన్న అధికారిక విధానమని మేయర్‌ వివరించారు. ఆ మొత్తాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా నగరపాలక సంస్థ ఖాతాలోనే జమ చేస్తారని తెలిపారు. వాహనాలు అమ్ముతున్నారనే ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో బయటపెట్టాలని మేయర్‌ సవాల్‌ చేశారు. అధికారిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చి పారిశుధ్య, దోమల నియంత్రణ చర్యలను మరింత వేగవంతం చేస్తామని  తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>