కలం, కరీంనగర్ : తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ముజీబ్(Md Mujeeb) విమర్శలు చేశారు. రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చినప్పటికీ.. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి సెప్టెంబర్ 17, 1948న లభించిందని ముజీబ్ పేర్కొన్నారు. అందువల్ల సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు. చారిత్రాత్మక పోరాటాలను, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఎండీ ముజీబ్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

