కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం పట్టణం సమీపంలో ఉన్న పురుషోత్తమపట్నం దేవస్థానం భూముల్లో (Purushothapatnam Temple Lands) అక్రమంగా నిర్మించిన ఇళ్లపై బుధవారం అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆక్రమిత స్థలాలను దేవస్థానం ఈవో, సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
స్థానిక ఆక్రమణదారులకు చట్టపరమైన అంశాలను, అక్రమ నిర్మాణాల పరిణామాలను అధికారులు స్పష్టంగా వివరించడంతో, పలువురు తమ ఇళ్లను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. నివాసం లేకుండా ఖాళీగా ఉన్న మిగిలిన అక్రమ నిర్మాణాలను ఎటపాక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, దేవస్థాన సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పూర్తిగా కూల్చివేశారు.
ఇదిలా ఉండగా, మిగిలిన ఇళ్ల యజమానులు తమ నిర్మాణాలను స్వయంగా తొలగించుకోవడానికి కొంత సమయం కావాలని అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన ఎటపాక పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తూ.. ఈ నెల 25వ తేదీ లోపు ఆక్రమణదారులు తమంతట తాముగా ఇళ్లను పూర్తిగా తొలగించుకోవాలని గడువు విధించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఖాళీ చేయకపోతే అధికారులే స్వయంగా వచ్చి కూల్చివేతలు చేపడతారని, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

