కలం, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ( Danthalapally) మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్సై) వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ ఓ కుటుంబం పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగింది. బాధితుల కథనం ప్రకారం… భూ వివాదం, ఇంటి దారికి సంబంధించిన విషయంలో శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తమపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను, వాస్తవాలను పరిశీలించకుండానే దంతాలపల్లి ఎస్సై బి. రవికుమార్ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
తరచూ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై నుంచి తమకు తీవ్ర ప్రాణహాని ఉందని, ఆయన వేధింపులు తట్టుకోలేకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, ఎస్సై రవికుమార్‌పై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని రూప్సింగ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మహిళ కొంపముంచిన 80s ట్రెండ్.. 45 ఏళ్ల నాటి చోరీ గుట్టురట్టు
Follow Us On: X(Twitter)

