మహిళ కొంపముంచిన 80s ట్రెండ్.. 45 ఏళ్ల నాటి చోరీ గుట్టురట్టు

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో సరదాగా మొదలైన ఓ ట్రెండ్ ఓ మహిళకు ఊహించని చిక్కులు తెచ్చిపెట్టింది. ఏకంగా 45 ఏళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసును ఛేదించేందుకు ఆ ట్రెండ్ కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో (Ujjain) చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 1980ల (80s Trend) నాటి రూపాన్ని చూపించేలా ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చివరకు ఆమె గతాన్ని బయటపెట్టింది.

నాలుగు దశాబ్దాల క్రితం నగల దుకాణంలో చోరీ

సుమారు 45 ఏళ్ల క్రితం ఉజ్జయినిలోని ఓ స్వర్ణకారుడి దుకాణంలోకి యువతిగా వచ్చిన ఓ మహిళ బంగారు హారం చోరీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పట్లో పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ నిందితురాలి ఆచూకీ లభించలేదు. అనంతరం ఆమె తన పేరు, గుర్తింపును మార్చుకుని మరో ప్రాంతంలో జీవనం కొనసాగించింది. దీంతో ఈ కేసు కాలక్రమంలో మరుగునపడిపోయింది.

వైరల్ ట్రెండ్‌లో భాగంగా ఏఐ ఫొటో

అయితే ఇటీవల సోషల్ మీడియాలో 1980ల కాలం నాటి రూపాన్ని(80s Trend) ప్రతిబింబించే ఫొటోల ట్రెండ్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఏఐ సాంకేతికతను ఉపయోగించి అప్పటి కాలంలో తమ రూపం ఎలా ఉండేదో చూపించే చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర వేదికల్లో పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో సదరు మహిళ కూడా తన పాతకాలపు రూపాన్ని పోలిన ఏఐ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఫొటో చూసి గుర్తించిన దుకాణ యజమాని

ఆమె పెట్టిన పోస్ట్ అనుకోకుండా అప్పటి నగల దుకాణం యజమాని దృష్టికి వెళ్లింది. ఫొటోలోని ముఖకవళికలను గమనించిన ఆయన, దశాబ్దాల క్రితం తన దుకాణంలో చోరీ చేసిన మహిళను గుర్తుపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు కేసును మరోసారి తెరపైకి తీసుకొచ్చి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆ మహిళ గతంలో జరిగిన చోరీలో తన ప్రమేయాన్ని అంగీకరించింది. ఇలా సరదాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్.. 45 ఏళ్లుగా పరిష్కారం కాని కేసుకు అనూహ్యంగా కీలక ఆధారంగా మారింది.

Also Read : వెస్టిండీస్‌తో సిరీస్: పంత్, హార్దిక్‌ పైనే అందరి దృష్టి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>