కలం, కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) పార్టీ మూడో విడత జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విడుదల చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్‌ను (Gunjapadugu Hariprasad) నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు హరిప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హరిప్రసాద్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా పార్టీని సిద్ధం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి జిల్లాలో పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

