కలం, నిర్మల్ రూరల్: ప్రజా ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ (Nirmal Rural) మండలం మేడిపల్లి (Medipalli) గ్రామానికి ఎన్హెచ్-44 నుంచి రూ.3.50 కోట్లతో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు 50 ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు చిత్రపటాలకు సోమవారం కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా సోమ భీంరెడ్డి మాట్లాడుతూ మేడిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించిన కూచాడి శ్రీహరిరావుకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇందిరమ్మ ఇళ్లతో గ్రామంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో మేడిపల్లి గ్రామ రూపురేఖలు మారనున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

