కలం, వెబ్ డెస్క్: దళిత స్పీకర్‌ను అధ్యక్షా.. అని పిలవాల్సి వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. డమ్మీ అసెంబ్లీలో దళితుడిని స్పీకర్‌గా, బీసీని సీఎంగా పెట్టారని విమర్శించారు. దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమించాలన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు తొలగించాలని తానే స్పీకర్‌ను కోరతానని తెలిపారు.
దళితులను బీఆర్ఎస్ దగా చేసిందని.. స్పీకర్‌ను పట్టుకుని దారుణంగా మాట్లాడారని మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్, అందె శ్రీ వంటి వారిని కేసీఆర్ ఎలా అవమానించారో చూశామన్నారు. దళితబంధును కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడం కోసమే తెచ్చారని గుర్తు చేశారు. దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేశారని, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు.
కొండా సురేఖకు పిలుపు తెలియదు..
కొండా సురేఖకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిన విషయం తనకు తెలియదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ విదేశాలకు చదువుకునేందుకు వెళ్తుండటంతో.. కొత్తగా ఎవరు వస్తారో అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. నిషేధిత భూముల విషయంలో గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని.. వాటిని సరిచేసేందుకు తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

